నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న విలువైన లోహాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,943 తగ్గి, రూ. 73,600కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,564 తగ్గి, రూ. 53,951కి, వెండి ధర రూ. 2,397 తగ్గి రూ. 71,211కుచేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా పడిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా బంగారం ధరలను తగ్గేలా చేశాయని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment