Skip to main content

ప్రభాస్‌.. రాముడిగా కనిపించనున్నారా?

 




అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 3డీ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. మంగళవారం ఉదయం టైటిల్‌తో పాటు, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో ఈ సినిమాపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్‌లో రామాయణ పాత్రలు కనిపించడంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపైనే చర్చ మొదలైంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడా? లేదా? ఆ పాత్ర లక్షణాలతో ప్రభాస్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌తో ప్రభాస్‌ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది.

‘‘ప్రభాస్‌గారిని రాముడిగా చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆ పాత్రను వెండితెరపై చాలా కొద్దిమంది నటులు మాత్రమే పోషించారు. చిత్ర బృందానిఇక శుభాకాంక్షలు’’ అని నాగ్‌ అశ్విన్ ట్వీట్‌ చేయడంతో ‘ఆది పురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించ లేదు. దీనిపై దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ..‘‘నా విజన్‌ను గుర్తించి సినిమాలో భాగస్వామి అయింనందుకు ప్రభాస్‌కు ధన్యవాదాలు. నా కలల ప్రాజెక్టుకు భూషణ్‌జీ సహకారం మర్చిపోలేను. మునుపెన్నడూ ప్రేక్షకులు చూడని సరికొత్త అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తాం’’ అని పేర్కొన్నారు.


ఇదే విషయమైన నిర్మాత భూషణ్‌కుమార్‌ సైతం మాట్లాడారు. ‘‘మేము నిర్మించే ప్రతి ప్రాజెక్టు విషయంలో మా ముద్ర ఉంటుంది. అయితే, ‘ఆది పురుష్‌’ విషయంలో ఓం రౌత్‌ కథ చెప్పిన విధానం నచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును వదులుకోకూడదని అనుకున్నాం. చిన్నప్పటి నుంచి ఈ కథలను వింటూ పెరిగాం. అందుకే కథ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా. పెద్ద తెరపై అద్భుత చిత్ర రాజాన్ని చూసేందుకు ప్రేక్షకులు సిద్ధం కావాలి’’ అని అన్నారు.

‘ఆది పురుష్‌’చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తున్నారు. చిత్ర నిర్మాణంతో పాటు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు కూడా సమాంతరంగా చేస్తారట. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ రెండు పూర్తయిన తర్వాత ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ అవతారం ఎత్తుతారు.


Comments