ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ నుంచే రేషన్ కార్డుకు అప్లై చేయవచ్చు.. ఎలాగంటే..? ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ నుంచే రేషన్ కార్డుకు అప్లై చేయవచ్చు.. ఎలాగంటే..?
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం వన్ నేషన్ వన్ కార్డ్ పేరిట సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. దీని వల్ల దేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలైనా ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు. రేషన్ కార్డు దారులకు చాలా తక్కువ ధరలకే రేషన్ సరుకులను అందజేస్తారు. ఇక కార్డులను కేవలం రేషన్ పొందడం కోసమే కాకుండా పలు అవసరాల కోసం గుర్తింపు కార్డులలా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే రేషన్ కార్డుల కోసం ఇక రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆ కార్డుకు అప్లై చేయవచ్చు.. ఎలాగంటే…
దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు సౌకర్యాన్ని అందజేస్తున్నాయి. రేషన్ కార్డును పొందేందుకు ప్రజలు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఆ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. అందుకు గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రేషన్ కార్డు వెబ్‌సైట్లను సందర్శించాలి. వెబ్‌సైట్‌లో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే వెబ్ పేజీలో వివరాలను నమోదు చేయాలి. పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా తదితర వివరాలను ఎంటర్ చేయాలి.
అనంతరం ఐడీ ప్రూఫ్ కింద ఆధార్, పాన్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీలలో దేన్నయినా సమర్పించవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద గ్యాస్ బిల్, కరెంట్ బిల్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఓటర్ ఐడీ, ఆధార్, రెంటల్ అగ్రిమెంట్‌లలో దేన్నయినా సమర్పించవచ్చు. అలా డాక్యుమెంట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాక సబ్‌మిట్ నొక్కాలి. అనంతరం స్వల్ప రుసుం చెల్లించాలి. రేషన్ కార్డును పొందేందుకు భిన్న రాష్ట్రాలు భిన్న ఫీజులను వసూలు చేస్తున్నాయి. అది రూ.5 నుంచి రూ.45 వరకు ఉంది. ఆ మొత్తాన్ని చెల్లించాలి. దీంతో రశీదు వస్తుంది.
తరువాత ప్రభుత్వ సిబ్బంది వెరిఫికేషన్‌కు వస్తారు. వారు వివరాలన్నీ పరిశీలించి సరిగ్గా ఉన్నాయా, లేదా అని చెక్ చేస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే.. 30 రోజుల్గోగా రేషన్ కార్డు వస్తుంది. లేదా మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా సులభంగా రేషన్ కార్డును పొందవచ్చు.
అయితే రేషన్ కార్డును పొందేందుకు పలు నిబంధనలను కూడా విధించారు…
* రేషన్ కార్డుకు అప్లై చేసే వారి పేరిట ఏ రాష్ట్రంలోనూ రేషన్ కార్డు ఉండరాదు.
* ఒకసారి ఒకే చోట రేషన్ కార్డుకు అప్లై చేయాలి. ఒకేసారి అనేక చోట్ల రేషన్ కార్డుకు అప్లై చేయరాదు. ఒకసారి తిరస్కరణకు గురైతే తప్పులు సరిచేసుకుని మళ్లీ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.
* 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తమ పేరిట కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేయవచ్చు.
* 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు తమ తల్లి లేదా తండ్రి పేరిట రేషన్ కార్డుకు అప్లై చేయాలి. దీంతో వారి పేర్లు ఆ కార్డులో వస్తాయి.
* ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే.. కుటుంబ పెద్ద పేరిట కార్డు తీసుకోవచ్చు. కానీ అతనితో ఇంట్లో నివాసం ఉంటున్న సభ్యులకు సంబంధం ఉండాలి. వారు కుటుంబ సభ్యులు లేదా బంధువులు అయి ఉండాలి.
* తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను కలిపి రేషన్ కార్డు తీసుకోవచ్చు.
* రేషన్ కార్డుకు దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లు లేదా ఇచ్చిన వివరాల్లో తప్పులు ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కనుక వారు తప్పులను సరిచేసుకుని మళ్లీ కార్డులకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. కనుక ముందే తప్పులు లేకుండా దరఖాస్తు నింపాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత వెబ్‌సైట్లు, యాప్‌లలో రేషన్ కార్డులను అప్లై చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. కనుక ఒక్కో రాష్ట్రానికి రేషన్ కార్డుకు అప్లై చేసేందుకు ఒక్కో సైట్ ఉంటుంది. ఆ సైట్‌లోకి వెళ్లి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు కొత్తగా కార్డుకు అప్లై చేయరాదు.
Comments
Post a Comment