Skip to main content

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా ‘వైయ‌స్సార్ వన్’



అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నూత‌న పారిశ్రామిక పాల‌సీ

పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైయ‌స్సార్ వన్’ పేరిట కొత్త విధానం తెచ్చామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నూతన పారిశ్రామిక పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు. 

సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ..

గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాద‌ని మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు.  అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు. క‌నీసం ప‌ది మందికి ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌కు వంద‌శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ, భూమి ధ‌రలో 50 శాతం రాయితీ ఇస్తామ‌న్నారు. యూనిట్‌కు రూ.1.25 విద్యుత్ రాయితీ, రూ.50 ల‌క్ష‌ల పెట్టుబ‌డి వ‌ర‌కు 35 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌న్నారు. 

ప్రత్యేక రాయితీలు..

కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని గౌతంరెడ్డి పేర్కొన్నారు.  సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఆయ‌న‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను కల్పిస్తామని, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.

Comments