Skip to main content

సంక్షోభానికి ముగింపు పలికిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్... కెమెరాలకు నవ్వుతూ పోజులు!

 


రాజస్థాన్ లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ ఇవాళ సీఎం అశోక్ గెహ్లాట్ ను కలిశారు. రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే ప్రథమం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొనేందుకు తన ఇంటికి రావాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి సచిన్ పైలట్ కు ఆహ్వానం అందింది.

అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ లో చేసిన పోస్టు కూడా సుహృద్భావ వైఖరికి దర్పణం పట్టింది. మర్చిపోదాం, క్షమించుదాం... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చేయి కలుపుదాం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందో చెప్పనక్కర్లేదు. ఇక, ఇరువురి భేటీ విషయానికొస్తే, కరోనా ప్రభావం నేపథ్యంలో మాస్కులతో హాజరయ్యారు. అనేక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఎంతో ఆప్యాయంగా పలుకరించుకుంటూ, కరచాలనం చేస్తూ, చిరునవ్వులతో ఫొటోలకు పోజులిచ్చారు. రేపటినుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

అటు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించగా, బలం నిరూపించుకుంటామని సీఎం గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేసింది. నెలరోజులకు పైగా సాగిన ఈ రాజకీయ సంక్షోభం సమసిపోవడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కీలకపాత్ర పోషించారు. ఆయన కూడా ఇవాళ్టి సమావేశంలో ఎంతో హుషారుగా కనిపించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.