రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన ఈ రోజు చరిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఉందని, నేడు తానిక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన స్థలంలో వెండి ఇటుకను వేసి భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. భారత దేశమంతా నేడు రామజపాన్ని స్మరిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులందరినీ మోదీ అభినందించారు.’ దశాబ్దాల కల నెరేవేరింది. రాముడి ఔన్నత్యాన్ని భారతీయులందరూ అలవరచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహత్తర క్షణం కోసం తాను, ఈ దేశం ఎన్నేళ్లుగానో వేచి చూసినట్టు ఆయన చెప్పారు.
రాముడు మన అందరిలో ఉన్నాడని, మన సంస్కృతికి రాముడే ఆధారమని మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం చరిత్రాత్మకమైనదే కాదు.. చరిత్ర పునరావృతమవుతుందని తెలిపే రోజిది.. దేశంలోని కోట్లాది భక్తుల కల నెరవేరబోతోంది అని ఆయన అన్నారు. సత్యం, అహింస, శాంతి, విశ్వాసం, త్యాగనిరతికి పెట్టింది పేరయిన ఈ దేశం ధర్మాన్ని ప్రబోధిస్తుందంటే అది రాముడి చలవే అని ఆయన వ్యాఖ్యానించారు. రాముడు విశ్వజనీనుడని, కబీర్ దాస్, నానక్ ల ప్రబోధాలకు స్ఫూర్తినిచ్చాడని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కి రాముడు ప్రతీక అని అభివర్ణించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం నమ్మశక్యం కాని ఘటన అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. .
Comments
Post a Comment