Skip to main content

ఏపీలో 'ఫోన్‌ ట్యాపింగ్' కలకలంపై‌ హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్

 ఆంధ్రప్రదేశ్‌లో 'ఫోన్ ట్యాపింగ్‌' ఆరోపణలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఏపీ‌ హైకోర్టులోని కొందరు జడ్జీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.


ఇందుకోసం సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది.

అలాగే, ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.  

Comments