Skip to main content

ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు


సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆడపిల్లలకు కొడుకులతో పాటు సమాన ఆస్తి హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని తెలిపింది.


ఓ కేసులో బాధితురాలి తండ్రి 1999, డిసెంబర్ 11న మరణించారు. అయితే, ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు క‌ల్పించే హిందూ వార‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2005లో అమ‌ల్లోకి వ‌చ్చింది కాబట్టి,  ఈ కేసులోని బాధితురాలికి ఆస్తిలో సమానహక్కు దక్కదని ప్ర‌తివాదులు వాదించారు.

అయితే, తండ్రికి ఆడపిల్ల ఉంటే చాలని, ఆస్తిలో వారికి సమానహక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005, సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఆడపిల్లకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు చెప్పింది.  

Comments