మాజీ స్పీకర్, జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రధాన సలహాదారు నాదెండ్ల మనోహర్ తెలివి తేటలు అమోఘం. గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ సర్కార్‌పై టీడీపీ, వైసీపీలు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని, దానికి కావాల్సిన సభ్యులను తాను కూడగడుతానని పవన్‌కల్యాణ్ చెప్పడం, అందుకు తగ్గట్టుగా వైసీపీ చేయడం తెలిసిందే. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ ఢిల్లీ మొహం కూడా చూడలేదు. అది వేరే విషయం.
అప్పట్లో ఇంత అద్భుతమైన సలహా తనకు ఇచ్చింది నాదెండ్ల మనోహరే అని పలు సందర్భాల్లో పవన్‌కల్యాణ్ చెప్పారు. దీన్నిబట్టి నాదెండ్ల మనోహర్ తెలివితేటల వల్ల పవన్‌కల్యాణ్ ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారో అర్థమవుతోంది కదా!
మూడు రాజధానులపై భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో అధినేత పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. ఇది ప్రభుత్వ అజెండా ప్రకారం కాకుండా వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమన్నారు. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... ఆ వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు.
అసలు ఈ రాజధాని తరలింపునకు ప్రధాన బీజం ఎవరి హయాంలో పడిందో నాదెండ్ల మనోహర్ విషదీకరించి చెప్పారు. తన రాజకీయ, సామాజిక అవగాహనతో ఆయన ఏమన్నారంటే....
‘చంద్రబాబు ఒక తెలివైన సేల్స్ మేన్. మార్కెటింగ్ చేసుకున్నారు. అంతే తప్ప రాజధాని నిర్మాణం విషయంలో బలమైన చట్టం తీసుకోవడంపై శ్రద్ధపెట్ట లేదు. దాని ఫలితమే ఇది. మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపై తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరిచారు. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. అంటే నాడు ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది’ అని తేల్చి చెప్పారు.
నాదెండ్ల మనోహర్ న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన విద్యావంతుడు. అలాగే శాసన చట్టాలపై కూడా ఆయనకు లోతైన అవ గాహన ఉంది. రాజధాని రైతులతో చంద్రబాబు సర్కార్ చేసుకున్న ఒప్పందం గురించి నాదెండ్ల క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాతే ఆయన మేధస్సు నుంచి ఇలాంటి మాటలు వచ్చాయని అర్థం చేసుకోవాలి. అంటే రైతులతో బాబు చేసుకున్న చట్టం న్యాయ సమీక్షకు నిలబడదనేలా నాదెండ్ల అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతో కీలకమైన అంశం. రైతులతో బాబు చేసుకున్న ఒప్పందంలో అసలు వాస్తవాలు ఏంటో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ సమాజానికి చెప్పాల్సిన, తెలియాల్సిన అవసరం ఉంది. ఆ పని మరింత వివరంగా, సమగ్రంగా నాదెండ్ల లాంటి వారు చెప్పాలి.
Comments
Post a Comment