గోదావరి వరదల నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై పరిశీలనకు వెళ్లిన జనసేన బృందాలు చెబుతున్న వివరాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు కూడా లేవని, పసిపిల్లలకు పాలు కూడా అందడంలేదని వెల్లడించారు. వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని, పసిబిడ్డలకు పాల కోసం అడిగితే పాలు అత్యవసర వస్తువుల జాబితాలో లేవన్న నిర్లక్ష్యపూరితమైన సమాధానం అధికారుల నుంచి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పాలను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి పసిబిడ్డల ఆకలి తీర్చాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని స్పష్టం చేశారు. వరదల కారణంగా 10 వేల ఎకరాల్లో వరి పంట, 14 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయని, రైతులను ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాలని తెలిపారు.
Comments
Post a Comment