సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment