భారత్‌లో నిషేధానికి గురై తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల్ని మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని వాల్‌మార్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్ ప్రకటనపై ఇటు మైక్రోసాఫ్ట్ కానీ, టిక్‌టాక్ కానీ స్పందించలేదు. టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అధ్యక్షుడు ట్రంప్ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో కార్యకలాపాల్ని విక్రయించాలని.. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అందుకు సెప్టెంబరు 15 గడువుగా విధించారు.
Comments
Post a Comment