Skip to main content

టీపీఏల ప్రమేయం లేకుండా.. ఇక నేరుగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌..!



దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ క్లెయిమ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీదారులు ఇక నుంచి టీపీఏల (థర్‌ పార్టీ అడ్మినిస్ర్టేటర్ల) ప్రమేయం లేకుండా నేరుగా బీమా కంపెనీకే క్లెయిమ్‌ పంపించుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

దీంతో టీపీఏల పాత్ర పూర్తిగా తొలగిపోయి బీమా కంపెనీల అంతర్గత బృందాలే క్లెయిమ్‌ పరిష్కారంపై నిర్ణయం ప్రకటించాల్సి వస్తుంది. ఇక నుంచి టీపీఏలు బీమా కంపెనీల తరఫున ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిశీలన, చెల్లింపు బాధ్యత తీసుకోనక్కరలేదంటూ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పాలసీదారులు తమ క్లెయిమ్‌ కోసం టీపీఏను సంప్రదించాల్సి వచ్చేది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. క్లెయిమ్‌ల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో బీమా కంపెనీలు చెల్లింపులు త్వరితం చేసేందుకు అంతర్గత బృందాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే టీపీఏ పలు బీమా సంస్థలకు పని చేస్తుండటమే ఈ జాప్యానికి కారణమని, దానికి బదులు అంతర్గత బృందాలకే బాధ్యత అప్పగిస్తే క్లెయిమ్‌ సత్వరమే పరిష్కరించవచ్చని ఐఆర్‌డీఏఐ భావించింది.

Comments