Skip to main content

కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం


కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా ప్రకటించుకున్న నేపథ్యంలో, కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ నేడు కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.

ఇదే ప్యానల్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్దన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తదితరులు సభ్యులుగా ఉంటారు. కాగా, రష్యా చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ నిరాకరించింది. రష్యా వ్యాక్సిన్ ను ఇండియాకు దిగుమతి చేస్తారా? అన్న ప్రశ్నపై భూషణ్ స్పందిస్తూ, వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం, తయారీకి అవసరమైన నిధులు, ఎన్ని డోస్ లు అవసరపడతాయి అనే విషయాలను చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అంతర్గత చర్చల ద్వారానే ముందడుగు వేస్తామని, ఈ విషయంలో అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని అన్నారు.

కాగా, ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, కాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్ లు తొలి దశను పూర్తి చేసుకుని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఈ రెండు సంస్థలూ స్వదేశీ పరిజ్ఞానంతోనే వ్యాక్సిన్ తయారు చేశాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను ఇండియాలో నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ లలో దేని పనితీరు మెరుగ్గా ఉంటే, దాన్ని అందుబాటులోకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఇవ్వాలన్నది ప్రభుత్వ అభిమతం

Comments

Popular posts from this blog

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతి

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతిసాకేత పురంలో రాముడికి భూమి పూజ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్ చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమని పేర్కొన్నారు. భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.