రాబోయే రోజుల్లో కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇందుకోసం నూతనంగా జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, ఉద్యోగ నియామకం, ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను ఎన్‌ఆర్‌ఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Post a Comment