జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే గాయపడ్డ జవాన్‌ను స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment