Skip to main content

విశాఖ రాజధాని శంకుస్థాపనకు మోదీ వస్తారా? రారా..?? |


రాకపోతే ఒక తంటా!.. వస్తే మరో తంటా ! ఇది మోడీ పరిస్థితి !!

ఆగస్టు 15న అధికారికంగా విశాఖ రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిర్మాణాలు, పూర్తిస్థాయి కట్టడాలు ప్రస్తుతానికి ఏమీ ఉండవు గాని పరిపాలన భవనం, సీఎం క్యాంప్ ఆఫీస్, అధికారుల భవనాలుగా మాత్రం కొన్ని ప్రైవేటు భవనాలను వాడుతుంటారు. మరి వీటి ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కు మోదీని ఆహ్వానిస్తారు. సరిగ్గా ఐదేళ్ల క్రిందట 2015 అక్టోబర్ లో అమరావతి రాజధాని శంకుస్థాపన కు ప్రధాని మోదీ వచ్చారు. గంగా నది నుండి నీటిని, పార్లమెంట్ భవనం నుండి మట్టి తీసుకువచ్చారు. కానీ రాజధానికి పెద్దగా నిధులు ఇచ్చింది, కల్పించిన ప్రయోజనం ఏమి లేదు.

ఇప్పుడు విశాఖ కు వస్తారా రారా అంటే వైసీపీ కూడా ఖచ్చితంగా చెప్పలేక పోతుంది. బీజేపీ వర్గాలు మాత్రం రాకపోవచ్చనే అంటున్నారు. దానికి కారణం ఆ రోజు ఆగస్టు 15 కావడం, ఢిల్లీలో స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉండటం, అమరావతిని స్వయంగా ప్రధాని మోదీ తన చేతులతో శంకుస్థాపన చేయడం, మళ్లీ ఇప్పుడు విశాఖ వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి, మీరే శంకుస్థాపన చేశారు కదా? అనే ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఈ గొడవంతా ఎందుకులే అనుకొని మోదీ రాకపోవచ్చని బిజెపి వర్గాలు అంటున్నాయి. కానీ వైసిపి మాత్రం తమ ప్రణాళికలు పని చేసి పూర్తిస్థాయి లాబీయింగ్ చేసి మోదీ ని కనుక రప్పించగల్గితే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు జగన్ పైన, వైసీపీ పైన పూర్తి స్థాయిలో ఉన్నాయని రాష్ట్రంలో ప్రతి సగటు మనిషికి అర్థం అవుతుంది. అందుకే మోదీ ని రప్పించేందుకు వైసీపీ ప్రయత్నం వైసీపీ చేస్తుండగా, రాకుండా ఉండేందుకు బిజెపి సాకులు వెతుకుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో!.

Comments