ప్లాస్మా దానం. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. అసలు ప్లాస్మా అంటే ఏంటి? ప్లాస్మా అన్నది ఇప్పుడు ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చింది? కోవిడ్ పేషెంట్ల పాలిట ప్లాస్మా ఒక సంజీవనిలా ఎందుకవుతోంది? ఇవన్నీ ఖచ్చితంగా ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సి యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాలోనూ ఇలాంటి యాంటీబాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు, ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.
అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, డాక్టర్లు ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ప్లాస్మా దానం చేసిన వారికి 5వేల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించారు.
ఇంతకూ ప్లాస్మా అంటే ఏంటి?
రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ద్రవాన్నే ప్లాస్మా అంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లేట్స్ వంటివి తొలగించిన తర్వాత మిగిలి ఉండే ద్రవమే ప్లాస్మా. మన రక్తంలో 55 శాతం దాకా ప్లాస్మా ఉంటుంది.
పసుపు రంగులో ఉండే ప్లాస్మా ద్రవం ఎంజైమ్‌లు, రోగ నిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి ఉంటుంది. శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడంతో పాటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్లాస్మా ఉపయోగపడుతుంది .
ప్లాస్మా థెరపి అంటే ఏంటి?
కోవిడ్ ను ఎదుర్కోవడానికి మనిషిలో ఉండే రోగ నిరోధక శక్తి కీలకమైనది. కోవిడ్ ను జయించిన వారి శరీరంలో రోగ నిరోధక కణాలతో కూడిన ప్లాస్మాను సేకరించి వైరస్ సోకిన వారి శరీరంలోకి పంపిస్తారు. దీంతో వారిలో కూడా రోగ నిరోధక కణాలు ఏర్పడి వైరస్‌ను నాశనం చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియను ప్లాస్మా థెరపీ అంటారు.
ప్లాస్మా ఎలా సేకరిస్తారు?
ప్లాస్మా సేకరించే విధానం కూడా రక్తదానం చేయడంలాగే ఉంటుంది. శరీరంలో నుంచి రక్తాన్ని తీసుకొని అందులో ప్లాస్మాను వేరు చేస్తారు. ఆస్పెరిసెస్ అనే విధానం కూడా ఉంటుంది. ఈ విధానం ద్వారా అయితే సేకరించిన రక్తంలో నుంచి ప్లాస్మాను వేరు చేసిన తర్వాత రక్తాన్ని మళ్లీ శరీరంలోకి పంపిస్తారు. దీనికి కొన్ని ప్రత్యేక యంత్రాలు అవసరమవుతాయి.
ప్లాస్మా దానం ఎవరు చేయొచ్చు?
కోవిడ్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారే ప్లాస్మా దానం చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి నుంచి ప్లాస్మా తీసుకోరు. రోగ నిరోధక కణాలు సరైన స్థాయిలో ఉన్నాయో లేదో ఎలీసా పరీక్ష ద్వారా వైద్యులు తెలుసుకుంటారు.
ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేసిన తర్వాత కోవిడ్ మన శరీరంలో లేదని వైద్యులు నిర్ధారించాకే ప్లాస్మా దానం చేయాలి. శరీర బరువు కనీసం 55 కిలోలు, రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12 ఉండి రక్తనాణ్యత బాగుండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే ప్లాస్మా సేకరిస్తారు.
ఒక వ్యక్తి ప్లాస్మాతో ఎంత మందిని కాపాడొచ్చు?
రోగ నిరోధక శక్తి లేక కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండి, శ్వాస సమస్యలతో ఆరోగ్యం విషమించిన వారికి మాత్రమే ప్లాస్మా థెరపీ చేస్తారు. ఇలా బాధపడే వారికి 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఇస్తారు. అంటే ఒక వ్యక్తి చేసిన ప్లాస్మా దానంతో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడవచ్చు. ప్లాస్మా ఎక్కించిన తర్వాత కేవలం 2 రోజుల నుంచి పేషెంట్ కోలుకోవడం ప్రారంభమవుతుంది.
ఒకరి నుంచి ఎంత ప్లాస్మా తీయవచ్చు?
ఒక వ్యక్తి నుంచి సుమారు 800 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. ఈ రక్తం నుంచి సుమారు 400 మిల్లీ లీటర్ల ప్లాస్మాను తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్లాస్మా దానం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా?
ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రావు. ఇది కూడా రక్తదానం లాంటిదే. ఒకసారి ప్లాస్మా దానం చేశాక మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. కాబట్టి ప్లాస్మాను దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వాళ్లమవుతాం.
కాబట్టి, కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
Comments
Post a Comment