టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. ఇటీవలే అచ్చెన్న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment