Skip to main content

పర్సనల్ విషయం చెబుతాడనుకుంటే.. జస్ట్ సినిమా గురించే చెప్పిన సాయితేజ్!

 


ప్రతిరోజూ పండగే' సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ మీద ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం 10 గంటలకు ఓ విషయం చెబుతానంటూ సాయితేజ్ తన ట్విట్టర్ ఖాతాలో నిన్న ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.


'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోలు నిఖిల్, నితిన్‌తో పాటు రానాల పేర్లను ప్రస్తావించాడు. అలాగే, సింగిల్‌గా ఉన్న ప్రభాస్‌కు టాటా చెప్పాడు. అయితే, ఈ రోజు తన పెళ్లి గురించి సాయితేజ్‌ ప్రకటన చేస్తాడని అభిమానులందరూ భావించారు.

తన పెళ్లి గురించి చెప్పకుండా సాయితేజ్‌ తన సినిమాలోని ఓ పాట గురించి ప్రకటన చేసి నిరాశపర్చాడు. ఇప్పటికే సోలో బతుకే సో బెటరు సినిమా  నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటలో టాలీవుడ్ హీరోలు రానా, వరుణ్ తేజ్‌లు కూడా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తున్నామంటూ ఆయన ప్రకటించాడు.  

'అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది???' అంటూ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాటను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పాడు. అయితే, పర్సనల్ విషయం గురించి చెబుతాడనుకుంటే సినిమా గురించి చెప్పాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Comments