Skip to main content

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి. . సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4

 దేశంలో సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4 అమలు కానుండగా.. మరిన్ని సడలింపులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. దశలవారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోంశాఖ అవకాశం కల్పించగా.. కంటైన్‌మెంట్‌ జోన్లలోమాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు

* సెప్టెంబర్‌ 21 నుంచి విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం. 100 మంది వరకు మాత్రమే అనుమతి

* సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు అనుమతి

* సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి

* వచ్చే నెల 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేత

* సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు లాంటి ప్రదేశాలకు అనుమతి నిరాకరణ

* అంతర్జాతీయ ప్రయాణాలపై కొనసాగనున్న నిషేధం (హోంశాఖ అనుమతించినవి తప్ప) 

స్థానిక లాక్‌డౌన్‌లు వద్దు..
కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయిస్తే స్థానికంగా ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని రాష్ట్రాలకు/ కేంద్ర ప్రాంతాలకు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్రం పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గానీ ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని రాష్ట్రాలకు సూచించింది. ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా వ్యక్తులు, సరకు రవాణాకు అనుమతించాలని మరోసారి స్పష్టంచేసింది.

Comments