దాదాపు 10 రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ. 56,200 వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై ధరలో కరెక్షన్ ట్రెండ్ ప్రారంభం కాగా, ప్రస్తుతం రూ. 51,100 వరకూ ధర దిగి వచ్చింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 14 వేలకు పైగా పడిపోయింది. ఓ దశలో రూ. 78 వేలను దాటిన వెండి ధర ఇప్పుడు రూ. 64 వేలకు చేరింది.
అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. కరోనాకు వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తిరిగి స్టాక్ మార్కెట్ వైపు మళ్లించాయి. దీంతో బులియన్ మార్కెట్ డీలా పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ ఉన్నప్పటికీ, రెండో దశ కరెక్షన్ రానుందని, బంగారం ధర మరింతగా తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఎంసీఎక్స్ లో ప్రస్తుతం బంగారం ధర ధర రూ. 50,924గా ఉండగా, వెండి ధర రూ. 64,007 వద్ద నిలిచింది. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 1,934 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 26.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్, చైనాల మధ్య ఒప్పందం కుదరడం కూడా బంగారం ధరలు పతనం కావడానికి కారణమైందని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక గతంలో బంగారం ధరల కరెక్షన్ చార్టులను పరిశీలిస్తే, మరో బ్రేక్ డౌన్ కనిపిస్తోందని అంచనా వేస్తున్న పండితులు, అది ఈ వారంలోనే ప్రారంభం కావచ్చని వ్యాఖ్యానించారు. ఔన్సు బంగారం ధర 1,915 డాలర్ల దిగువకు వస్తే, మరింత పతనం తప్పదని, బంగారం రేటు అధికంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టిన వారు, స్వల్ప నష్టాలతో సరిపెట్టుకోవాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున అమ్మకాలకు దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ఇదే ధర 1,800 డాలర్ల వరకూ చేరితే మాత్రం తిరిగి ఇన్వెస్టర్ల మద్దతు లభిస్తుందని వెల్లడించారు.
Comments
Post a Comment