ఇటీవలి కాలంలో తెలుగులో సీక్వెల్స్ నిర్మాణం పెరుగుతోంది. ఒక సినిమా హిట్టయితే కనుక దానికి సీక్వెల్ ను ప్లాన్ చేసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ముగింపును కూడా రూపొందిస్తున్నారు. చిత్రకథను కొనసాగించే అవకాశం ఉండేలా సినిమా ముగింపును ఇస్తున్నారు. ఈ క్రమంలో 'రాజుగారి గది' సినిమాకు త్వరలో నాలుగో ఎడిషన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి, ఐదేళ్ల క్రితం 'రాజుగారి గది' పేరిట ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. అది అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చిత్రాన్ని నిర్మించారు. అందులో నాగార్జున కథానాయకుడుగా నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత 'రాజుగారి గది 3'ని తెరకెక్కించారు. ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది. ఈ క్రమంలో 'రాజుగారి గది 4' చిత్ర నిర్మాణానికి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
Comments
Post a Comment