అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘మీ కోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి, తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే నాలుగేళ్లలో తాను ఏం చేయబోయేది వివరించారు. అమెరికాను మరోమారు సూపర్ పవర్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు.
చైనాకు తరలిపోయిన కంపెనీలు, ఉద్యోగాలను తిరిగి రప్పిస్తామన్నారు. చంద్రుడిపైకి మహిళను పంపడంతోపాటు అంగారకుడిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు. చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామన్నారు. అమెరికా చరిత్రలోనే లేని విధంగా ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామన్నారు.
ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలు అమెరికా కలలు, అరాచకవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. మనకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. అమెరికన్ జీవన విధానాన్ని కాపాడుకోవాలా? లేక విధ్వంసం సృష్టించే రాడికల్ ఉద్యమాలకు అనుమతి ఇవ్వాలా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రత్యర్థి జో బైడెన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమెరికా వారసత్వ విధ్వంసకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోవడంలో ఆయన పాత్ర ఉందన్నారు. ఉద్యమాల పేరుతో డెమోక్రాట్లు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. సామ్యవాదానికి బైడెన్ గెలుపు గుర్రంలా మారారని విమర్శించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్‌కు చైనాదే పూర్తి బాధ్యత అని పునరుద్ఘాటించారు.
Comments
Post a Comment