ఇండియన్ గ్రోసరీ డెలివరీ సేవల రంగంలో పోటీ అధికమవుతోంది. ఇప్పటికే దిగ్గజాలు ఉన్న ఈ రంగంలోకి తాజాగా రిలయన్స్ జియో మార్ట్ ప్రవేశిస్తుండటంతో పోటీ మరింత పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న వారే కాకుండా... కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే కంపెనీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో అగ్రగామిగా ఉన్న స్విగ్గి... త్వరలోనే గ్రోసరీ డెలివరీ లోకి పూర్తిస్థాయిలో రంగ ప్రవేశం చేయాలని భావిస్తోంది. అది కూడా అత్యంత వేగంగా డెలివరీ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
అదే జరిగితే వినియోగదారులకు గ్రోసరీల కొనుగోలు చాలా సులువు అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఒకే రంగంలో ఎక్కువ మంది ప్లేయర్లు సేవలు అందిస్తే తప్పనిసరిగా అక్కడ ఆఫర్ల వెల్లువ కొనసాగుతుంది. కాబట్టి, దాని ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో ఈ కామర్స్ రంగంలోనూ, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లోనూ అదే జరిగింది. ఆఫర్లు ఎక్కడ ఉంటే అక్కడే ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు అలవాటుపడిపోయారు. దీంతో రూ వందల, రూ వేల కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయి.
45 నిమిషాల్లోనే డెలివరీ...
ఇన్ స్టా మార్ట్ అనే బ్రాండ్ నేమ్ తో స్విగ్గి ఆప్ లో గ్రోసరీస్ కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డార్క్ స్టోర్ లను ఏర్పాటు చేయటం ద్వారా వినియోగదారులకు అత్యంత వేగంగా డెలివరీ సేవలను అందించాలని భావిస్తోంది. అది కూడా కేవలం 45 నిమిషాల్లోనే వినియోగదారులకు డెలివరీ అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇన్ స్టా మార్ట్ సేవల్లో భాగంగా ఒకే వేదికపై సుమారు 2,500 రకాల ఐటమ్స్ డెలివరీ లను అందించనుంది. అందులో మీల్స్ తో పాటు గ్రోసరీలు, కూరగాయలు, పండ్లు వంటి సరుకులు ఉంటాయి. మరోవైపు స్విగ్గి అందించబోయే మరో విశిష్టమైన సేవలు ఏమంటే... వినియోగదారులకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డెలివరీ సేవలు అందుబాటులో ఉంచనుంది. దీంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు ఏ సమయంలోనైనా సరుకుల డెలివరీ సేవలు పొందవచ్చు. గురుగ్రామ్ లో మొదలు పెట్టి, బెంగళూరు కు ఈ సేవలను విస్తరించనువుంది. తర్వాత క్రమంగా ఇతర నగరాల్లో సేవలు ప్రారంభించనుంది.
డార్క్ స్టోర్ అంటే...
ఇటీవల ఈ కామర్స్, అనుబంధ రంగాల్లో డార్క్ స్టోర్లు అనే కాన్సెప్ట్ మొదలైంది. అంటే వాస్తవిక స్టోర్ కు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ స్టోర్ కేవలం వర్చువల్ స్టోర్ లా పనిచేస్తుంది. ఈ స్టోర్ సాధారణంగా వినియోగదారులు నేరుగా షాపింగ్ చేసేందుకు అనుమతించదు. కేవలం ఆన్లైన్ లో వచ్చిన ఆర్డర్లను ప్రాసెస్ చేసేందుకు మాత్రమే తన సేవలను అందిస్తుంది. ఉదాహరణకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఒక వినియోగదారుడు కూరగాయలు ఆర్డర్ చేస్తే... మామూలుగా నైతే వాటిని సమీపంలోని ఒక కూరగాయల షాపు నుంచి, లేదా ఆన్లైన్ స్టోర్ సొంత వేర్హౌస్ నుంచి తెచ్చి ఇస్తారు. కానీ, డార్క్ స్టోర్ ఫార్మాట్ లో జూబ్లీహిల్స్ లోనే ఒక ప్రదేశంలో ఒక డార్క్ స్టోర్ ఉంటుంది. అది మిగితా వినియోగదారులకు కనిపించదు. కానీ ఆన్లైన్ స్టోర్ కు మాత్రం సరుకులను ప్యాక్ చేసి డెలివరీ కోసం ఇస్తుంది. అంటే కేవలం ఆన్లైన్ ఆర్డర్ల కోసమే వీటిని ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ఒక డార్క్ స్టోర్ నుంచి సమీపంలోని ఆర్డర్లు డెలివరీ చేయటం వేగవంతం అవుతుంది.
వాటితో పోటీ ఈజీ కాదు..
స్విగ్గి ప్రయత్నాలు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... ఈ రంగంలో ఇప్పటికే పాతుకు పోయిన దిగ్గజాలతో పోటీ అంటే అంత ఆశా మాషీ వ్యవహారం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. బిగ్ బాస్కెట్ ఈ రంగంలో ఇప్పటి వరకు అగ్రగామిగా ఉంది. అమెజాన్ కూడా క్రమంగా విస్తరిస్తోంది. ఫ్లిప్కార్ట్ కూడా క్విక్ పేరుతో ఈ సేవల్లోకి ప్రవేశించింది. గంటన్నర లో సరుకులను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే రంగంలో రిలయన్స్ జియో మార్ట్ కూడా ప్రవేశిస్తోంది. దీంతో ఇంత పోటీ ని స్విగ్గి ఎలా తట్టుకుని నిలబడుతుందో వేచి చూడాల్సిందే నని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరవైపు కేవలం 45 నిమిషాల్లో సరుకులను డెలివరీ చేయటం దాదాపు అసాధ్యం అని తేల్చేస్తున్నారు. గతంలో కూడా బిగ్ బాస్కెట్ 2 గంటల్లో డెలివరీ చేస్తామని చెప్పి ఫెయిల్ అయింది. ఇదే కాన్సెప్ట్ తో అమెజాన్ నౌ పేరుతో సేవలు ప్రారంభించి మూసేసింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా గంటన్నర అంటోంది. స్విగ్గి మరీ 45 నిమిషాల్లోనే డెలివరీ అంటే ఏమవుతుందో చూడాలి మరి.
Comments
Post a Comment