కరోనా కారణంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా ప్రభావంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ లో క్లాసులను ప్రారంభించినప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం క్లాసులు ప్రారంభం కాలేదు. వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను అధికారులు సిద్దం చేశారు.
ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభమవుతాయని జగన్ చెప్పారని... లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈనెల 31వ తేదీ వరకు పాఠశాలలను ప్రారంభించకూడదనే కేంద్ర ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 31 తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా నాడు-నేడు పనులను పూర్తి చేసి స్కూళ్లను ప్రారంభించాలనేది తమ ఆలోచన అని చెప్పారు. అయితే, 31వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని మంత్రి చెప్పడంతో... కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో స్కూళ్లు ప్రారంభం కాకపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
Comments
Post a Comment