Skip to main content

త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్.. 21 నెలల్లో పూర్తి చేయాల‌ని టార్గెట్..!

 


2022 నాటికి భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకల్ని జరుపుకోబోతోంది. ఆ సమయానికి కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభల సమావేశాలు జరగాలని కేంద్రం భావిస్తోంది. అయితే, కరోనా వైరస్ కారణంగా దీనికి సంబంధించిన ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి యూపీఏ-2 హయాంలోనే ప్రతిపాదన వచ్చింది. నాటి స్పీకర్ మీరా కుమారి దీనిపై సూచనలు కోరుతూ ఓ కమిటీని కూడా నియమించారు. 85 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన పార్లమెంటు బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్న కారణంతో పాటు పురాతన భవనాల్ని కాపాడుకోవాలని నాటి ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే, ప్రస్తుత మోడి ప్రభుత్వం కూడా “పురాతన భవనాలు అంత క్షేమదాయకంగా లేవని,  వాటిని పరిరక్షించుకునే చర్యలు తీసుకుంటూనే, అధునాతన సౌకర్యాలతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ” సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.  పురాతన భవనం బాహ్యరూపానికి అనుగుణంగానే, కొత్త పార్లమెంట్ భవనానికి కూడా రూపకల్పన చేయడం జరిగింది. గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్  ఆర్కిటెక్ట్ సంస్థ “HCP Designs” రూపకల్పన బాధ్యతలు చేపట్టింది. ప్రతి ఏడాది పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఉభయ సభలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరుపుతుంది. ఆ కేటాయింపులలోనే ఈ కొత్త భవనాల నిర్మాణానికి లోక సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ బడ్జెట్ కేటాయింపులను ఆమోదించారు. ఒకేసారి కాకుండా, వచ్చే రెండేళ్లపాటు ఉభయ సభలు వాటికి లభించే బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆర్ధిక వనరులను సమకూర్చనున్నాయు. 65 వేల చదరపు మీటర్ల వైశాల్యం గల పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని రూ. 889 కోట్లతో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా, రెండతస్తుల కొత్త పార్లమెంట్ భవనం 21 నెలల్లో పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ముందుగా 776 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించాలని అంచనా వేసినప్పటికీ, ఆలస్యం కావడంతో ఆ అంచనాలు 18.8 శాతం మేరకు పెరిగాయి. 2022 కల్లా నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఉంది. అన్ని ముఖ్యమైన పాలనాపరమైన, బడ్జెట్ అనుమతులు లభించాయు. ఇక సుప్రీంకోర్టు కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా భారత పార్లమెంటుకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని చెక్కు చెదరకుండా భావి తరాల అవసరాలకు తగ్గట్టుగా ఈ బృహత్తర ప్రాజెక్టు కు రూపకల్పన చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజధానిలో పాలనాపరమైన భవనాలను  అధునాతన వసతులతో, సర్వహంగులతో పునర్నిర్మాణం చేయాలన్న బృహత్తర ప్రణాళిక లో భాగంగానే ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతోంది. పార్లమెంట్ భవన సముదాయానికి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటినీ 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పునర్నిర్మాణం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అతి ప్రధాన  పాలనాకేంద్రంగా ఉన్నఈ ప్రాంతాన్ని “సెంట్రల్ విస్తా” ప్రాజెక్ట్ గా రూపకల్పన చేయడం జరిగింది. 2026లో లోకసభ నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)  జరుగనున్న నేపధ్యంలో, లోకసభ స్థానాల పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనం ప్రస్తుతం ఉభయసభల్లో ఉన్న 745 మంది సభ్యులకు అంతంత మాత్రంగానే సరిపోతోంది. కొత్త పార్లమెంట్ భవనంలో ఒకేసారి 1345 మంది సభ్యులు జాయింట్ సెషన్ లో ( సంయుక్త పార్లమెంట్ సమావేశం) పాల్గొనే విధంగా విశాలమైన సెంట్రల్ హాల్ ను విరమించేందుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత లోకసభ కు నాలుగింతలు ఉండే విధంగా కొత్త లోకసభ ను, ప్రస్తుత రాజ్యసభ కు మూడింతలు ఉండే విధంగా కొత్త రాజ్యసభ నిర్మాణానికి  రూపకల్పన జరిగింది. మధ్యలో పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా డిజైన్ చేశారు.

రాష్ట్రపతి భవన్ కు దక్షిణాన ప్రధాన మంత్రి కి అధికార నివాసం, ఉపరాష్ట్రపతికి కూడా కొత్త అధికార నివాసం ఈ “సెంట్రల్ విస్తా” ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నాయి. అంతేగాకుండా, రాష్ట్రపతి భవన్ వెనుకభాగంలో ఉన్న 75 ఎకరాలలో వివిధ వాతావరణాలలో ప్రపంచవ్యాప్తంగా పెరిగే పలు రకాల వృక్షాలను పెంచేందుకు ప్రణాళికలు రచించారు. ఇక సౌత్ బ్లాక్, నార్త్ బ్లాకులు ప్రదర్శన శాలలుగా మారనున్నాయి. స్వాతంత్ర పోరాటానికి నాంది పలికిన,  1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు ముందు జరిగిన పరిణామాలన్నింటినీ  ఒక “బ్లాక్” లో, 1857 నుంచి స్వాతంత్రం సాధించేంతవరకు  జరిగిన పరిణామాలను మరొక “బ్లాక్” లో ప్రదర్శనగా ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచస్థాయు నాణ్యత ప్రమాణాలతో కూడిన సాంకేతిక హంగులతో ఈ మ్యూజియంలను తీర్చిదిద్దనున్నారు. ఇక, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేటు వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు, పచ్చదనానికి విఘాతం కలుగకుండా, “రాజపధ్” కు ఇరువైపులా ఉన్న శాస్త్రి భవన్, కృషి భవన్, రైలు భవన్, ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, వాయుసేన భవన్ లను పడగొట్టి, సర్వహంగులతో ఒక్కొక్కటి 8 అంతస్తులుండే 10 భవనాలను నిర్మించేందుకు రూపకల్పన చేయడం జరిగింది. అయితే, 8 అంతస్తులుండే ఈ భవనాలు, ఇండియా గేట్ కంటే తక్కువ ఎత్తులోనే ఉండేవిధంగా డిజైన్ చేశారు. మొత్తం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం వలన, సమయం వృధా కాకుండా, ఖర్చును కూడా బాగా తగ్గించవచ్చని,  వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించవచ్చన్నది ఆలోచన. దేశ రాజధాని లో ప్రతి ఏడాది ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం అద్దెలకింద1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దేశ రాజధాని నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒక్కచోటకు తీసుకురావాలన్నది మోడీ ప్రభుత్వ ఆలోచన. వివిధ శాఖలు, విభాగాలలో మొత్తం 35 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసే విధంగా ఈ భవనాలను రూపొందిస్తున్నారు. ఈ కొత్త భవనాల వల్ల ఇండియా గేట్ పరిసర ప్రాంతాలలో గతంలో కంటే అదనంగా ఐదున్నర ఎకరాలలో పచ్చదనం పెరగేవిధంగా ప్లాన్ చేశారు.

Comments