Skip to main content

వివాహితను వేధించిన వ్యక్తి.. బాధితురాలితో రాఖీ కట్టించుకుని రూ. 11 వేలు ఇవ్వాలంటూ కోర్టు విలక్షణ తీర్పు



వివాహితను వేధించిన కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ విలక్షణ తీర్పు చెప్పింది. 30 ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి వేధించిన కేసులో ఉజ్జయినికి చెందిన విక్రమ్ బాగ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. నిందితుడు బెయిలు కోసం అప్పీలు చేసుకోగా రూ. 50 వేల వ్యక్తిగత పూచీపై ఇండోర్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, బెయిలు మంజూరు చేస్తూనే న్యాయమూర్తి రోహిత్ ఆర్య కొన్ని షరతులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రక్షాబంధన్ రోజైన ఆగస్టు 3న (నేడు) ఉదయం 11 గంటలకు తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లి ఆమెతో రక్షాబంధన్ కట్టించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఆమెకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటానని ప్రమాణం చేసి రూ. 11 వేలు ఇవ్వాలని, ఆమె కుమారుడికి రూ. 5 వేలు ఖర్చు చేసి దుస్తులు, స్వీట్లు కొనివ్వాలని, బాధితురాలి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.  

Comments