Skip to main content

ఉద్యోగం కోసం ‘నారాయణ’ వద్దకు వెళ్లా...ఆయనపైనే గెలిచి మంత్రినయ్యా : డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌

 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడినైన తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని, కానీ అనుకోని ఘటనలు ఎదురు కావడంతో నా జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఒకప్పుడు నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని, అదే కళాశాల యజమాని నారాయణపై గెలిచి మంత్రిని కావడం యాధృశ్చికమన్నారు.

‘డాక్టర్‌ కోర్సు చదివాను. కానీ ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయలేదు. మా నాన్నగారు చనిపోవడంతో డెంటిస్ట్‌గా వెళ్లేందుకు మనసు అంగీకరించ లేదు. దీంతో ఓ కూల్‌ డ్రింక్‌ షాపులో ఎప్పుడూ కూర్చుని కాలక్షేపం చేసేవాడిని’ అని మంత్రి తెలిపారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారని అడిగితే ‘డాక్టర్‌ చదివాడు, ఖాళీగా తిరుగుతున్నాడు’ అని  చెప్పేదన్నారు.

దీంతో నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు. అయితే వారు మూడు నెలలు ఆగి వస్తే చెబుతామనడంతో అక్కడ చేరే అవకాశం రాలేదన్నారు. ఈలోగా మా బాబాయి చనిపోవడం, అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. అదే నారాయణపై పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఒకవేళ నారాయణ ఉద్యోగం ఇచ్చివుంటే నా పరిస్థితి వేరుగా ఉండేదేమోనని అన్నారు.  

Comments