తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు.
ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు.
వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, వర్మ దేశభక్తి వద్దన్నాడని వాళ్లు మానుకోరు కదా, వర్మ తల్లి, భార్య ఎందుకు అన్నాడని వాళ్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండరు కదా అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై కోపం లేదని, తాను వర్మను బాగు చేయాలని భావిస్తున్నానని తెలిపారు.
"తాను చనిపోతే ఇంట్లో అందరూ ఆనందిస్తారని వర్మే అన్నాడు. కానీ అతను చనిపోయే లోపు అతడ్ని బాగు చేసి, అతడి తల్లికి ఓ మంచివాడ్ని అందించాలన్నది నా అభిమతం. అతడి విమర్శల్లోంచి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాను" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.
Comments
Post a Comment