Skip to main content

రాజధాని రైతులూ..తెదేపా మాయలో పడొద్దు’



 రాజధాని ప్రాంతంలో 57 శాతం నుంచి 90 శాతం వరకే కట్టిన నాలుగు భవనాలు తప్ప ఇంకేమీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాజధానిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి జరిగిన పనులపై ఆరా తీశారని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో పర్యటిస్తానంటున్న తెదేపా అధినేత చంద్రబాబు.. రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా అని ప్రశ్నించారు. 5 శాతం పనులే పూర్తి చేసి దాన్ని రాజధాని కట్టేయడం అంటారా? అని బొత్స నిలదీశారు. ఈ విషయంలో రైతులు చంద్రబాబును నిలదీయాలన్నారు.

అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.  తెదేపా మాయలో రాజధాని రైతులు పడొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. అమరావతి పట్టణమా? గ్రామమా? అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 14400 కాల్ సెంటర్ ప్రారంభించామని.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేయలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీన్ని మెచ్చుకుంటారో లేక తెదేపా కోరస్‌లా మాట్లాడతారో చూడాలని బొత్స వ్యాఖ్యానించారు.

Comments