Skip to main content

అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్


It looks like Uddhav Thackeray is afraid of Prime Minister Modi Owaisi said., ‘ అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న సిగపట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెరైటీగా స్పందించారు. ‘ 50 : 50 అన్నది మార్కెట్ లో కొత్త బిస్కెట్ లా ఉంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. (అధికారాన్ని చెరి సగం పంచుకునేందుకు శివసేన.. బీజేపీతో 50 : 50 షేరింగ్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఫార్ములా పట్ల బీజేపీ విముఖత చూపుతోంది.) తాము బీజేపీకి గానీ, శివసేనకు గానీ మద్దతు తెలుపబోమని ఒవైసీ స్పష్టం చేశారు. ‘ 50 : 50 అంటే ఏమిటి ? ఇది మార్కెట్లో లభించే కొత్త బిస్కెట్టా ? ముందు మహారాష్ట్ర ప్రజలకోసం ఏదో ఒకటి చేయండి.. సతారా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాల గురించి బీజేపీ గానీ, సేన గానీ పట్టించుకున్నాయా ? సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ‘ అంటే ఇదేనా ? ‘ అని ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రెండు సీట్లను గెలుచుకుంది.
ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ గానీ, మరొకరు గానీ సీఎం అవుతారా కారా అన్న విషయం తనకు తెలియదని, అంతా ‘ మ్యూజికల్ చైర్స్ ‘ ఆట ఆడుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు. అసలు ఏం చేయాలో శివసేనకు తోచడం లేదని, ప్రధాని మోదీ అంటే ఉధ్ధవ్ థాక్రే భయపడినట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.

Comments