Skip to main content

వెంకయ్యనాయుడ్ని ఉద్దేశించి సీఎం మాట్లాడిన పద్ధతి బాగాలేదు: సుజనా చౌదరి


ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. చర్చనీయాంశంగా మారిన ఇంగ్లీషు మీడియం అంశంపై మాట్లాడుతూ, ఇంగ్లీషు మీడియం అమలు చేసేముందు టీచర్లను ఆ దిశగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో కొన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తే సానుకూల ఫలితాలు రాలేదని అన్నారు. సరైన అధ్యయనం లేకుండా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు ఎటూ కాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంగ్లీషు మీడియం అంశంలో సీఎం జగన్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలను సుజనా తప్పుబట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సీఎం వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలుగు అధ్యయన కేంద్రం మైసూరులో ఉంటే దాన్ని ఏపీకి తీసుకువచ్చిన ఘనత వెంకయ్యనాయుడికే చెందుతుందని, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి సీఎం మాట్లాడిన పద్ధతి బాగాలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా వ్యక్తిగత కక్షల పైనుంచి దృష్టి మరల్చి, పాలనపై శ్రద్ధ చూపితే బాగుంటుందని హితవు పలికారు.  

Comments