Skip to main content

ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి.. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ ఎవరు? ఆయన ప్రస్థానం ఏమిటి?




అజిత్ పవార్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు షాకిస్తూ... బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. ఈ ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. గంటల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన అజిత్ పవార్ ఎవరో తెలుసుకుందాం.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ కు విద్యా పరంగా ఎస్ఎస్సీ (మహారాష్ట్ర బోర్డు) సర్టిఫికెట్ ఉంది. ఆ తర్వాత చదువును కొనసాగిస్తున్న సమయంలో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో, విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు, తన చదువును కొనసాగించడానికి పూణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబైకి మకాం మార్చారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పూణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై... అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు. ఇదే సమయంలో బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.

తాజాగా, అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చడం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎన్సీపీనే కాదు... మా కుటుంబం కూడా చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...