Skip to main content

సీబీఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదన్న న్యాయస్థానం!






ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది.

ప్రస్తుతం తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని ... ఒక రోజు కోర్టుకు వస్తే తన ప్రొటోకాల్, సెక్యూరిటీ కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చవుతుందని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. దీనికి తోడు, ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని తెలిపారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు తన బదులు తన న్యాయవాది అశోక్ రెడ్డి హాజరవుతారని, వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోర్టును కోరారు.

అయితే, గతంలో ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను జగన్ ప్రభావితం చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. అధికారులంతా ముఖ్యమంత్రి మాటను వినాల్సి ఉంటుందని, ఆయనకు వ్యక్తిగత మినహాయింపును ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... జగన్ కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రాజగోపాల్ ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.