మహారాష్ట్రలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని, ఈ దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ ఉదయం సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. శివసేన - ఎన్సీపీల మధ్య ఓ డీల్ కుదిరితే, ఆపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని, ముందు ఆ రెండు పార్టీలూ ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, శివసేన - ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో ఈ సాయంత్రం నుంచి మూడు పార్టీల మధ్యా తుది చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment