అద్భుత పాలన అందిస్తే నేను.. సినిమాలు చేసుకుంటా
‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది. ఆ కార్మికుల కష్టాల్లో నాకు దేవుడు కనిపించాడు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి’’ అని పవన్ అన్నారు.
‘‘నన్ను విమర్శిస్తున్న నాయకుల బతుకులు తెలుసు. కన్నబాబును నాగబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని అలుసా? ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే మాకు తెలుసు. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల ఎకరాలు లేవు. వైకాపా నేతల్లా రాజకీయాల్లో రూ.వందలకోట్లు ఖర్చు పెట్టలేను. నన్ను విమర్శించే నాయకులంతా ఓ పార్టీ పెట్టి చూడండి. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. నేను డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తిని కాదు..భావజాలంతో నడుపుతున్నా’’ అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు
‘‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో వైకాపా ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం చేసిన తప్పునకు ఉపాధి కోల్పోయి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఒక్కో కార్మికుడికి రూ.50వేల సాయం ఇవ్వాలి. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలి. రెండు వారాల్లో ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. చంద్రబాబుపై కోపం కార్మికులపై చూపొద్దు. పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైనా నిర్మాణాలతో పాలన మొదలెడతారు.. వీళ్లు మాత్రం కూల్చివేతలతో మొదలెట్టారు. ఎంతవేగంగా నిర్మాణాలను కూల్చివేశారో ప్రభుత్వం కూడా అంతేవేగంగా పడిపోతుంది’’ అని పవన్ దుయ్యబట్టారు.
Comments
Post a Comment