Skip to main content

అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?: జగన్ సంచలన వ్యాఖ్యలు!

 


ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్, ఇటీవలి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం వద్దని చెప్పడంపై విరుచుకుపడుతూ, "అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే, ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం" అని అన్నారు.

డిసెంబర్ లో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 40 వేల స్కూళ్లలో 15 వేల స్కూళ్లను మార్చనున్నామని, అందుకోసం 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. స్కూళ్లు ఇప్పుడెలా ఉన్నాయి? మారిపోయిన తరువాత ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఫోటోలు తీసి అందరికీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. స్కూళ్లను మార్చి చూపిస్తానని జగన్ తెలిపారు.

Comments