మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ స్పష్టంచేసింది. హస్తం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే దిల్లీలో స్పందించారు. ‘‘మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారంపై మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, మహారాష్ట్ర పీసీసీ సభ్యులతో మాట్లాడినట్టు ఇప్పటికే మీడియాకు ప్రకటన విడుదల చేశాం. మా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్‌తో ఇప్పటికే మాట్లాడారు. తదుపరి చర్చలు ముంబయిలో మంగళవారం జరుగుతాయి’’ అని ఖర్గే స్పష్టంచేశారు. సోమవారం ఉదయం దిల్లీలోని 10 జన్‌పథ్‌లో రెండు పర్యాయాలు భేటీ అయిన కాంగ్రెస్ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతోనూ సోనియా మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన లేఖలను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు రాజ్‌భవన్‌కు పంపినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇంకా శివసేనకు అలాంటి లేఖలేమీ పంపలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఈ రోజు ఉదయం దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలోనే శివసేనతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరాలా? లేదంటే బయటి నుంచే మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై సోనియా గాంధీ నేతృత్వంలో నేతలు కీలక మంతనాలు చేశారు. ఇదే విషయంపై జైపూర్‌లోని రిసార్ట్స్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతోనూ సోనియా గాంధీ మాట్లాడారు. వారంతా ఇందుకు అంగీకరించినట్టు సమాచారం.
మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్ 21న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి ‘మహాయుతి’ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాయి. అలాగే, కాంగ్రెస్ - ఎన్సీపీ కూడా కూటమిగానే బరిలోకి దిగాయి. అక్టోబర్ 24న వెల్లడైన ఫలితాల్లో భాజపా 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను (145 స్థానాలు) ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. భాజపా, శివసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం ఇరు పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరాఠా రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. సీఎం పదవీ కాలం చెరిసగం పంచుకోవడంపై తలెత్తిన వివాదంపై దాదాపు మూడు వారాలుగా ఈ రెండు కాషాయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోగా.. నేతల మధ్య మాటామాటా పెరగడంతో మరింత దూరం పెరిగింది. ఆరెస్సెస్ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. దీంతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది. గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేయడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు. దీంతో సైద్ధాంతికంగా సారూప్యత లేకపోయినప్పటికీ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కోరింది. ఎన్సీపీ మద్దతుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ‘మహా’ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.
Comments
Post a Comment