మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘నిన్న రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు(అజిత్ పవార్) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే టచ్‌లోనే ఉన్నారు. ఈరోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అజిత్ పవార్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు’’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై సంజయ్ రౌత్ ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అనుకుంటున్న వేళ.. భాజపాతో కలిసి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
Comments
Post a Comment