ఏపీలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకోవడం పట్ల విమర్శలు వస్తుండడం తెలిసిందే. దీనిపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాతృభాష తెలుగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే, తెలుగులో చదివితే ఏం ప్రయోజనం అని చెప్పడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ బాష చాలా గొప్పదన్న తరహాలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటప్పుడు పాదయాత్రలో కూడా ఇంగ్లీషులో మాట్లాడాల్సిందని ఎద్దేవా చేశారు. ఓట్లను కూడా తెలుగుకు బదులు ఇంగ్లీషులోనే అడిగితే బాగుండేదని అన్నారు. అప్పుడు ఓట్లన్నీ వైసీపీకే వచ్చుంటే ప్రజలు ఇంగ్లీషుకు సమ్మతం తెలిపినట్టుగా భావించవచ్చని వ్యాఖ్యానించారు, ఇంగ్లీషుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ మాతృభాషను చిన్నచూపు చూడడం ఎందుకని మండలి ప్రశ్నించారు.
ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.
Comments
Post a Comment