Skip to main content

ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు

 
ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు
 ఇసుక కొరతను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని మంత్రి కన్నబాబు విమర్శించారు. వరదల కారణంగా కొంతమేర ఇసుక కొరత ఉండటం వాస్తమేనని.. 10, 15 రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన తెదేపా నేతలతో కలిసి లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన పవన్‌కు ఇసుక కొరతపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒక్క సీటు వస్తేనే ఆయన మిడిసిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమాలు వదిలేసినా.. యాక్టింగ్‌ వదలడం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా జగన్‌నే విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు.
‘‘నన్ను తిట్టడం పవన్‌కు ఫ్యాషన్ అయిపోయింది. నా బతుకులో దాపరికం లేదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వలనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా. రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?  గాజువాకలో పవన్ పోటీ చేస్తే చంద్రబాబు ప్రచారం చేయలేదు. మంగళగిరిలో లోకేశ్‌ పోటీ చేస్తే జనసేన పార్టీ తరుఫున అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? 15 రోజుల్లో ఇసుక సమస్య తీర్చకపోతే అమరావతి వీధుల్లో నడుస్తానంటూ పవన్ సవాల్  చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు తప్ప మరో నాయకుడు ఆయనకు కనబడటం లేదు. అమరావతిలో అసలు వీధులే లేవు. చంద్రబాబు చూపింది గ్రాఫిక్స్ మాత్రమే. పవన్‌ కృత్రిమ రాజకీయ పోరాటాలు మానుకోవాలి. ఇసుక కొరత సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది’’ అని కన్నబాబు చెప్పారు.

Comments