ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వచ్చి చేరతామని ఆర్టీసీ ఐకాస ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించారు.
‘‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీపీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65 నుంచి 70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’’ అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Post a Comment