Skip to main content

ఆర్టీసీ సమ్మె విరమణ

సమ్మె విరమిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి
 తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె విరమించారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని అశ్వత్థామ పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరగుతుందనే నమ్మకముందని అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు. ఇన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలవలేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని.. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. మొదటి షిఫ్ట్‌ కార్మికులతో పాటు రెండో షిఫ్ట్‌ కార్మికులు కూడా రేపు ఉదయం డిపోల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు.
‘‘మనం చేసిన సమ్మె న్యాయబద్ధమైంది. 52 రోజులుగా సుదీర్ఘ కాలం శాంతియుత పోరాటం చేశాం. ఆర్టీసీని రక్షించుకోవడంతో పాటు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ పోరాటం చేశాం. ఇందులో నైతిక విజయం కార్మికులదే. కార్మిక వర్గమంతా అన్ని రోజులూ ఐకమత్యంతో ఉండి జేఏసీ ఇచ్చిన పిలుపును ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లిన వారికి ధన్యవాదాలు. ఈ పోరాటం వృథా పోదు. భవిష్యత్‌లో ఈ పోరాటం మన సమస్యల పరిష్కరానికి మార్గం చూపుతుందనుకుంటున్నా. సమ్మె సందర్భంగా పలువురు కార్మికులు చనిపోవడం బాధాకరం. వారి కుటుంబాలకు న్యాయం చేయటానికి జేఏసీ తప్పకుండా కృషి చేస్తుంది.’’
‘‘గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించి కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలి. అంతేకాదు, వారికి అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెను నేటి నుంచి విరమిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు వెంటనే వారి విధులకు హాజరుకావాలి’’ అని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

Comments