Skip to main content

కొనసాగుతున్న టీఎస్ ఆర్టీసీ సమ్మె... కార్మికులను విధుల్లోకి పిలిచేందుకు కేసీఆర్ సర్కారు ససేమిరా!



 నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉండదని భావించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. నిన్న సమావేశమైన ఉద్యోగ సంఘాలు, అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితిని కల్పిస్తే, విధుల్లోకి వస్తామని, విధుల్లోకి వచ్చే వారికి ఏ విధమైన షరతులు పెట్టరాదని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ విషయంలో కేసీఆర్ సర్కారు మాత్రం ఇంకా బెట్టు వీడలేదు. ఆర్టీసీ కార్మికుల కేసు లేబర్ కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో షరతులు పెట్టరాదన్న కార్మిక సంఘాల డిమాండ్ కు కూడా అంగీకరించరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

విధుల్లో చేరే వారు నిర్దిష్ట కాల పరిమితి వరకూ మరోమారు సమ్మెకు దిగకుండా బాండ్ రాసివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఇకపై ఎన్నడూ ప్రస్తావించరాదని ప్రభుత్వం షరతులు విధించనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. అయితే, ప్రభుత్వం విధించాలనుకుంటున్న షరతులపై కార్మిక సంఘాల నేతలకు సమాచారం త్వరలోనే వెళుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వం పెట్టే కొన్ని షరతులకు ఉద్యోగులు అంగీకరిస్తే, విధుల్లోకి రావచ్చని, అసలు ఈ సమ్మె చట్ట విరుద్ధమైనది కావడంతో, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా, ప్రజలకు మరోసారి సమస్య రాకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు.


Comments