Skip to main content

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత

రీ ఎలక్షన్‌కు మా వాళ్లు రెడీ: భాజపా నేత
 ముఖ్యమంత్రి పీఠంపై శివసేన పట్టువీడకపోవడంతో భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో కమళదళం ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ధూలే జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా ఈ డిమాండ్‌ వ్యక్తమైనట్లు సీఎం ఫడణవీస్‌కు సన్నిహితుడైన మంత్రి జయకుమార్‌ రావల్‌ ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోకూడదని, తమకు ఓ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేసి గెలిచి చూపిస్తామని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వెలిబుచ్చినట్లు రావల్‌ తెలిపారు. శివసేన కారణంగా కొన్ని చోట్ల పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

Comments