శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపింది తన సోదరుడి కుమారుడు అజిత్ పవారే తప్ప ఎన్సీపీ కాదని పునరుద్ఘాటించారు. ఇది ఎంతమాత్రం తమ పార్టీ నిర్ణయం కాదనీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని తాము అంగీకరించబోమని పవార్ స్పష్టంచేశారు. ఎన్సీపీ- కాంగ్రెస్- శివసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌తో తాను టచ్‌లో లేనన్నారు. అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ శనివారం ఉదయం అనూహ్యంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శరద్ పవార్ కరాడ్‌కు వెళ్లారు. ఆయన స్మారకం ‘ప్రీతి సంగమ్’ వద్ద పవార్ నివాళులర్పించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశాను. క్లిష్ట పరిస్థితులు వస్తాయి.. కానీ అవన్నీ తాత్కాలికమే. రాష్ట్ర ప్రజలు బలంగా నిలబడతారనేది నా అనుభవం’’ అని చెప్పారు. రాష్ట్రంలో తనకు యువకుల సహకారం ఉందని.. ఏదో జరిగిపోతుందన్న ఆందోళన తనకు లేదని పవార్ అన్నారు. పవార్ వెంట సతారా ఎంపీ శ్రీనివాస్ పాటిల్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment