విజయవాడలోని ప్రఖ్యాత స్టెల్లా మేరీ కాలేజీలో ఈ ఉదయం ఒకేసారి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వీరంతా హాస్టల్ లో ఉన్నవారేనని తెలుస్తుండటంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి, చికిత్స చేయిస్తున్నారు. జరిగిన ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం, ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తలను కొట్టి పారేసింది. వారంతా వైరల్ ఫీవర్ కు గురయ్యారని వివరణ ఇచ్చింది. అయితే, ఒకేసారి 30 మందికి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం యాజమాన్యం సమాధానం ఇవ్వలేదు. ఇక ఆసుపత్రుల్లో చేరిన వారిని పరామర్శించేందుకు వారివారి బంధుమిత్రులు తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment