Skip to main content

సొంత పార్టీవాళ్లు ఇబ్బందిపెడుతున్నారు... వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు..

సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ ఆరోపణలు చేశారు. చిలకలూరి పేటకు పట్టిన పీడను వదిలించాలని... పేకాటపై వాలిన అవినీతి గద్దలను తరిమివేయాలని జగనన్న పార్టీలో తాను చేరానని ఆమె అన్నారు. అయితే... కొన్ని దుష్ట శక్తులు తన కలలను చిదిమివేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు.

పట్టణంలోని ఎస్‌ఎంఎస్‌ గార్డెన్స్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ నాలుగు నెలలక్రితమే గెలుపు రుచిచూసినా ఏరోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీతోనూ, మాజీ మంత్రితో ఎందాకైనా పోరాడవచ్చు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని, మీకు అన్నీ తెలుసన్నారు.

ఆడపిల్లనైనా తాను నాలుగువైపుల నుంచి శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతపార్టీలోని కొందరు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  నా అనుకున్నవాళ్ళు సైతం తనను అడ్డుకోవాలని, నియంత్రించాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అందరి అండదండలు తనకు కావాలని, నిస్వార్థంగా పనిచేస్తానన్నారు. తన వెంటే ఉండి వెన్నుపోటు పొడవాలని చూసేవారి అంతుచూస్తానని, అదే తన నైజమని వారు హెచ్చరించారు.

Comments