Skip to main content

మందుబాబుల రక్తం జగన్ తాగేస్తున్నాడా? ఆనాడు నువ్వేం తాగావు?: చంద్రబాబుపై ఉమ్మారెడ్డి ఫైర్

 



రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడంటూ సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు.  ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిభ్రమించినట్టుందని అన్నారు. నాడు మహిళల సంక్షేమం కోరి ఎన్టీఆర్ మద్యనిషేధం ప్రకటిస్తే, దాన్ని ఎత్తేసిందెవరో ఓసారి చెప్పండి చంద్రబాబుగారూ అంటూ నిలదీశారు.

మద్యనిషేధం తొలగించడమే కాకుండా, ఫలానా షాపులో ఇంత మేర అమ్మకాలు జరగాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు కూడా ఇచ్చాడని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఆనాడు మద్యాన్ని ఒక ఆదాయవనరుగా చూసినప్పుడు మందుబాబుల రక్తాన్ని తాగుతున్నట్టు అనిపించలేదా? మరి ఆనాడు నువ్వు తాగింది రక్తమా? మంచి నీళ్లా? అని ప్రశ్నించారు.

"అప్పట్లో ఆదాయం వస్తుంటే నీ కళ్లు బైర్లు కమ్మాయి. కానీ జగన్ మేనిఫెస్టోలో పెట్టి మరీ మద్య నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేయాలని నిశ్చయించాడు. జగన్ చెప్పి చేస్తున్నాడు. కానీ నువ్వు చెప్పకుండా వాళ్ల రక్తాన్ని పీల్చేశావ్. అలాంటి నువ్వు ఇవాళ జగన్ మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడని అనడం సరికాదు" అంటూ హితవు పలికారు.

"పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళితే రూ.7500 కోట్లు నష్టం వస్తుందని అంటున్నావు. నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఏమైంది. గతంలో కంటే ఈసారి రూ.840 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిందని తేలింది. నువ్వేదో కాకి లెక్కలతో నోరేసుకుని మాట్లాడితే సరిపోదు. గతంలో టెండర్లు ఎక్కువ వేశారంటే అందులో నీకు పర్సంటేజి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ వేశారు. ఈ ప్రభుత్వ హయాంలో తక్కువకే టెండర్లు వేశారంటే ఎలాంటి పర్సంటేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. సింపుల్ లాజిక్!" అంటూ ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.   

Comments